Govt Decision on Holidays: తెలంగాణలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై నేడు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో వారం లేదా ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించే యోచన ఉంది. ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. విద్యాసంస్థల్లో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్లో బోధనకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే టీవీ పాఠాలు అందించడం కష్టమని.. టీశాట్, దూరదర్శన్ స్లాట్ బుక్ చేసుకోవడం, టైం టేబుల్ ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. బీటెక్, ఎంటెక్, ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 22 వరకు ఆన్లైన్ బోధన జరపాలని కళాశాలలకు జేఎన్టీయూహెచ్ ప్రకటించింది.
పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెబుతున్నాయి. అయితే సెలవులను పొడిగిస్తారా? లేదా? అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగి రావాలా? అక్కడే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటారన్న అభిప్రాయాన్ని కొందరు తల్లిదండ్రులు వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చూడండి: