మార్చి 7 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు కోసం అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మార్చి 7నుంచి పద్దు సమావేశాలు..
శాసనసభ, మండలిని సమావేశ పర్చాల్సిన తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాల్సి ఉంది. ఆ లోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాల్సి ఉండగా.. మార్చి 7 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 6న ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశంలో పద్దుకు అమాత్యులు ఆమోదం తెలుపనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సమాచారం ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు షురూ..
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది మొదటి సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. అయితే గత అక్టోబర్‌లో వాయిదా పడిన సమావేశాల కొనసాగింపుగా బడ్జెట్ భేటీ జరుగుతున్న తరుణంలో ఉభయసభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగం ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశాల ప్రారంభం రోజునే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేరుగా బడ్జెట్‌తోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : AP Budget: మార్చి 7 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు