వైకాపా ప్రభుత్వం రైతు భక్షక పాలన సాగిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని సమూలంగా నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. ఏడాదిగా ధాన్యం బకాయిలు చెల్లించకపోగా ఖరీఫ్ సీజన్లో ఇంత వరకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అప్పుల కోసం వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసపోతున్న రైతన్నలు..
ఏ పంటకూ మద్దతు ధర లభించట్లేదన్న అచ్చెన్న.. దళారీల ముసుగులో వైకాపా నేతలే రైతుల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. సబ్సీడీపై అందాల్సిన వ్యవసాయ పరికరాలు, ఎరువులను రద్దు చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులు వేసేందుకు చేసిన ఖర్చు కూడా వ్యవసాయ రంగానికి ఖర్చు చేయట్లేదని మండిపడ్డారు. కేసీ కాలువకు రెండేళ్లుగా మరమ్మతులు చేయకుండా కర్నూలు, కడపలో వేలాది ఎకరాలకు నీరు అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. పంటల బీమా ప్రీమియం విషయంలోలూ అసత్యాలు చెప్పడంతో లక్షలాది మంది రైతులు బీమా సొమ్మును కోల్పోయారన్నారు. అమూల్ డెయిరీ కోసం పాడిరైతుల ఆధ్వర్యంలో నడిచే డెయిరీలను మూయిస్తున్నారన్నారు. రైతులంతా ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని ఛరకాతో కొట్టే రోజు దగ్గరలోనే ఉందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై... మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!
'సీఎం జగన్ బెయిల్ రద్దు' అంటూ.. సామాజిక మాధ్యమాల్లో కల్పిత కథనాలు!