చట్టాన్ని, రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా నిరంకుశ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రజల ధన, మాన ప్రాణాలే ముఖ్యమని అసెంబ్లీలో జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. విద్వేషం, విధ్వంసం తప్ప ప్రజా సంక్షేమం గురించి ఏ రోజూ జగన్ ఆలోచించలేదని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
దేశమంతా లాక్డౌన్ పొడిగించాలని కోరుకుంటే.. జగన్ ఒక్కరే ఎత్తివేయాలని ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. బిహార్‌లో అసెంబ్లీ, రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించినపుడు లేని కరోనా... రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డొచ్చిందా అని నిలదీశారు. మద్యం దుకాణాలు తెరిచి రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ప్రభుత్వమే కారణమైందని ఆరోపించారు.
ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకునేందుకు కరోనా సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని జగన్... ప్రజల భద్రత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు.
ఇదీ చదవండీ... ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో తెదేపా విఫలం: బొత్స