రైతు భరోసా పేరిట ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా మోసం చేసి వారి పీకనొక్కిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పథకానికి సంబంధించి ఏడాది కాలంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు, సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాధానం, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్న వివరాలను ఆయన మంగళవారం ప్రదర్శించారు.
"గత ఏడాది అక్టోబర్లో 54 లక్షల మందికి రైతు భరోసా వర్తింపచేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఈసారి ఆ సంఖ్యను 50.47 లక్షల మందికి కుదిస్తూ ప్రకటన జారీ చేసి మూడున్నర లక్షల మందికి కోతపెట్టారు. 2019 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన 64.06 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. సొంత మీడియా సాక్షిలో 46.60 లక్షల మంది లబ్ధిదారులని రాశారు. వీటిల్లో ఏది కరెక్టో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్లో రైతు భరోసా లబ్ధిదారులు 38,45,945 మందికి మాత్రమే అమలు చేస్తున్నట్లు ఉంది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపే పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం 50.47లక్షల మందికని పత్రికా ప్రకటన ఎలా ఇచ్చింది. తప్పుడు లెక్కలతో అన్నం పెట్టే అన్నదాతల్ని నిలువునా మోసం చేశారు. ఈ మోసాలు తట్టుకోలేకే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగి ఏపీ అగ్రస్థానంలో ఉంది." అని మండిపడ్డారు.
ఇదీ చదవండి : రైతుల ఆర్థిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం వైఎస్ జగన్