కొవిడ్ బాధితులను ఆదుకోవాలని.. సాధన దీక్ష పేరిట... రాష్ట్ర వ్యాప్తంగా... తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో చేపట్టిన సాధన దీక్షలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే 10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని... విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న సాధన దీక్ష చేశారు. కరోనా మృతుల వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో బొండా ఉమ సాధన దీక్షకు దిగారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరోనా బాధితుల డిమాండ్ల సాధన కోసం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు దీక్ష చేపట్టారు. తెల్లకార్డు ఉన్న కుటుంబానికి 10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. చెన్నేకొత్తపల్లిలో మాజీ మంత్రి పరిటాల సునీత సాధన దీక్షకు దిగారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కళా వెంకటరావు సాధన దీక్ష నిర్వహించారు. సాధన దీక్షలో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిరసన తెలిపారు. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సాధన దీక్ష చేపట్టారు. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సాధన దీక్ష చేట్టారు. తూర్పు గోదావరి జిల్లా, విజయనగరం జిల్లాలోనూ సాధన దీక్ష సాగింది. ఆక్షిజన్ అందక చనిపోయిన కొవిడ్ బాధితులకు 25లక్షల పరిహారం ఇవ్వాలని నేతలు కోరారు.