- అమరావతి రైతులకు మద్ధతుగా తెలుగుదేశం నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని బాపట్ల నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. తెదేపా నేత వేగేశ్న నరేంద్ర వర్మ దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ దీక్షకు మద్దతు తెలిపారు.
- తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా నేతలు రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమరావతి రాజధాని కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. పి.గన్నవరం నియోజవర్గంలో తెదేపా నేతలు నిరసన తెలిపారు. రాజధాని కోసం అమరులైన రైతులకు నివాళులర్పించారు.
- ఆంధ్రుల కలల రాజధాని అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ఎదుట రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు.
- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. పెదనందిపాడులో తెదేపా నాయకులు జెండాలు పట్టుకుని రహదారిపై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తాడికొండ నియోజకవర్గంలో తెదేపా నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని నేతలు స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.
- పెనుగంచిప్రోలులో తెదేపా నేత చింతల సీతారామయ్య ఆధ్యర్యంలో రైతులకు మద్దతుగా నిరసనలు చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
- అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత జాస్తి వెంకటేశ్వరరావు, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
- ప్రకాశం జిల్లాలో అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానులు వద్దు..ఒక్కరాజధాని ముద్దు అని నినాదాలు చేశారు. అమరావతి సాధనకు అలుపెరగకుండా ఉద్యమం చేస్తున్న పోరాట యోధులకు మద్దతుగా ఒంగోలులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందన్నారు.
- పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెదేపాన నేతలు ప్రజారాజధాని అమరావతి కోసం మహాదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధానిని తరలించడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత బడేటి చంటి అన్నారు. పర్యటక ప్రాంతంగా.. రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిందిపోయి.. మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
- విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి రైతుల ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో విశాఖలో ఎమ్మెల్సీ దువ్వారావు రామారావు తన నివాసంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరులైన రైతులకు నివాళులు అర్పించారు. 9 గంటల నుంచి 5 గంటల వరకు దీక్ష చేపట్టారు.
- కడప జిల్లాలో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నేతలు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ అమీర్ బాబు వారి నివాసాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ ప్రభుత్వం అన్ని పార్టీలను గౌరవించి రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
- అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. తెదేపా నాయకులు అనంతపురం జిల్లా శింగనమల మండలకేంద్రంలో నిరసన చేపట్టారు. రాజధాని రైతులు 200 రోజులుగా ఉద్యమం చేస్తున్నా...ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం దారుణమన్నారు. రాజధాని నిర్మాణానికి వేలమంది రైతులు తమ భూములను త్యాగం చేసి... ఇప్పుడు రోడ్డున పడ్డారన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
- అమరావతి రైతులకు మద్దతుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నేతలు ఆందోళన చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
- అమరావతి రైతులకు బాసటగా అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నేతలు ఎన్టీఆర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ..నినాదాలు చేశారు. అమరావతి రైతులు 200 రోజులుగా ఉద్యమం చేస్తున్నా..ప్రభుత్వం స్పందించకపోవటం దారణమని నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాజధాని మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని తెదేపా శ్రేణులు హెచ్చరించాయి.
- నెల్లూరు జిల్లా కోవూరులో అమరావతి ఉద్యమానికి మద్దతుగా తెలుగుదేశం నేతలు మహా దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమరావతిని కాపాడుకునేందుకు ఏలాంటి ఉద్యమానికైనా సిద్ధమని పోలంరెడ్డి ప్రకటించారు. మూడు రాజధానుల విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
- విశాఖ పరిపాలన రాజధాని అయితే మడకశిర, హిందూపురం ప్రజలు 1200 కిలోమీటర్ల దూరం వెళ్ళగలరా అని ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రశ్నించారు. అమరావతి రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని ప్రకటించిన జగన్..ఇప్పడు మాట తప్పారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించి మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు