ప్రతిపక్ష నేత చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయటంపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై తాము సభలో నిలదీస్తామనే అధికారపక్షం చర్చ నుంచి పారిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. అసెంబ్లీ గేటు బయట నుంచి సచివాలయం అగ్నిమాపకకేంద్రం వరకూ చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీగా వచ్చారు. సభా, సంప్రదాయాలను మంట కలుపుతున్నారని మండిపడ్డారు.
రైతు సమస్యలపై మాట్లాడాలని తాము అసెంబ్లీకి వస్తే..., ప్రతిపక్షాలను తిట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాలేదని ఆక్షేపించారు. ధాన్యం ధర కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరల స్థిరీకరణ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని 15 వేలకే కుదించడం దారుణమన్నారు. తెదేపా హయాంలో రైతులకు 4 వేల 5 కోట్లు ఇన్సూరెన్స్ గా అందించామని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది కానీ పని జరగడం లేదని విమర్శించారు. సున్నా వడ్డీ అంటూ ఎంతో ఆర్భాటంగా చెప్పారు కానీ లక్ష లోపు ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారని తెదేపా నేతలు ఆక్షేపించారు.
నిరూపిస్తే రాజీనామాలు: తెదేపా ఎమ్మెల్సీలు
వ్యవసాయం దండగని చంద్రబాబు అనని మాటలను వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఆధారాలు చూపాలని అడిగితే ఆ పార్టీ నేతలు పారిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే 30 మంది తెదేపా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: