అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గత 300 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా గుంటూరులో తెదేపా నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. గుంటూరు వసంతారాయపురంలోని నక్కా ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, తెదేపా నేత జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ రామకృష్ణ పలువురు నేతలు పాల్గొన్నారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన దీక్షను చేపట్టారు. గాలిలోకి నల్ల బెలూన్లు ఎగురవేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమరావతిని రాజధానిగా సాధించేంత వరకు 300 రోజులు కాదు... 3 వేల రోజులైనా ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి వైకాపా నేతలు ఎన్నో కుట్రలు పన్నారన్నారు. అక్రమ కేసులు, అవమానాలు, అవహేళనలు చేశారన్నారు. మంత్రులు, స్పీకర్ సైతం రైతులు, మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని.. ఓ కులంపై కసితో రాజధానిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారన్నారు.
దోచుకునేందుకు తెరపైకి మూడు రాజధానుల ఆంశం: జీవీ
ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చేందుకే మూడు ముక్కలాట మొదలుపెట్టారన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను జగన్ సర్కారు హేళన చేస్తుందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. లక్షల కోట్ల సంపద వచ్చే అమరావతిని సీఎం జగన్ బలిచేశారన్నారు. దోచుకునేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. దిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పిన ప్రధాని మోదీ రైతులకు సమాధానం చెప్పాలన్నారు. గత 300 రోజులుగా రైతుల పోరాటం చేస్తుంటే సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని.. రాబోయే రోజులలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: