కరోనా వ్యాప్తితో రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ ముఖ్యమంత్రి జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తప్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు స్థానిక ఎన్నికలను వాయిదా వేయడమే ఆయన చేసిన నేరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజా క్షేమం పట్ల జగన్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి ఈ ఘటనే నిదర్శనమని దుయ్యబట్టారు. ఆర్డినెన్స్‌ను అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ నిబంధన 243(కె) ప్రకారం ఐదేళ్ల కాల పరిమితికి ఎస్‌ఈసీ నియామకం జరిగిందని గుర్తు చేశారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు : లోకేశ్
తనకు అడ్డొచ్చిన వాళ్లు ఎవరూ ఉండకూడదనే జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వం ప్రమాదకరమని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌కు రాజకీయాలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని దుయ్యబట్టారు. కరోనా సహాయక చర్యలను గాలికి వదిలి జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ తెదేపా శాసనసభాపక్షం మండిపడింది. న్యాయస్థానంలో భంగపాటు తప్పదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.
రాజ్యాంగ వ్యతిరేకం : టీడీఎల్పీ
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కక్షసాధింపు రాజ్యాంగ వ్యతిరేకమని తెదేపా శాసనసభాపక్షం మండిపడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి.. ఈ రాజ్యాంగ వ్యతిరేక ఆర్డినెన్స్ రద్దుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా సహాయక చర్యలను గాలికి వదిలి జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని టీడీఎల్పీ మండిపడింది.
నియంతృత్వ విధానాలు : కళా వెంకట్రావు
ఎన్నికల కమిషనర్ పదవి నుంచి రమేష్ కుమార్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్ నియంతృత్వ విధానాలను ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. కరోనా వైరస్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఎన్నికలు వాయుదా వేసి ప్రజల ప్రాణాలు కాపాడిన రమేష్ కుమార్‌ని రాష్ట్ర ప్రజలందరూ అభినందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ని తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకు రావటం సిగ్గుచేటని ఆక్షేపించారు.
కక్ష సాధింపే : కొల్లు రవీంద్ర
జగన్ ప్రభుత్వం నియంత పాలన చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎవరైనా ప్రభుత్వానికి ప్రతికూలంగా మాట్లాడితే వారిని విధుల నుండి తొలగించడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆక్షేపించారు.
ఇదీ చదవండి : 'మాస్కులు అడిగితే సస్పెండ్ చేయడమేంటి?'