హింస, దౌర్జన్యాలే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన ఉందని తెదేపా శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. స్వేచ్ఛను హరిస్తూ స్వచ్ఛ సంకల్పం నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ప్రజలపై చెత్త పన్ను వేస్తూ చెత్త పాలనకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. సత్యం, శాంతి, అహింసలు ఊపిరిగా గాంధీ జీవితం అన్న యనమల.. అడుగుకో అబద్ధం, కక్ష, హింసే ధ్యేయంగా జగన్ పాలన ఉందన్నారు. మహాత్మాగాంధీ అహింసను బోధిస్తే, జగన్ హింసా పాలన అందిస్తున్నారన్నారు. అవినీతి చక్రవర్తిగా జగన్ నిలిచారని మండిపడ్డారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి పాటు పడితే.. జగన్ మాత్రం ప్రశాంత గ్రామాల్లో కక్షలు-కార్పణ్యాలు రేపారని దుయ్యబట్టారు. మద్యం, గంజాయి, హెరాయిన్ అమ్మకాలతో రాష్ట్రాన్ని మత్తులో ముంచుతున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
డ్రగ్ మాఫియాను ఛేదించాలి..
ముఖ్యమంత్రి బంధువుల కంపెనీ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. రూ.2లక్షల కోట్ల మాదకద్రవ్యాల వ్యాపారం రాష్ట్రంలో జరిగిందన్న వర్ల.. ఈ మాఫియా డాన్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్థాన్‌లోని కందహార్ నుంచి ఆషీ ట్రేడింగ్ కంపెనీ అడ్రస్‌తో.. కాకినాడలోని ఆలీషాకు చెందిన కంపెనీకి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. పోలీసులు ఈ దిశగా ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు.
యువతను మత్తులోకి దించుతున్నారు..
మహిళలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్.. ఎప్పుడు నెరవేరుస్తారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో ఎప్పటినుంచి అమలుచేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి వస్తుందని.. జగన్ ప్రభుత్వం యువతను మత్తులోకి దించుతోందని ఆరోపించారు. మన రాష్ట్రానికి భవిష్యత్ ఉంటేనే తమకు భవిష్యత్ ఉంటుందనే వాస్తవాన్ని యువత గ్రహించాలని కోరారు. 2.30లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని ముఖ్యమంత్రిని నిలదీయాలని పిలుపునిచ్చారు. యువత పూనుకోకుంటే, ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్ కనుమరుగవడం ఖాయమని ఆమె హెచ్చరించారు.
ఇదీచదవండి.