తనకు చెడ్డపేరు వస్తున్నా, నమ్ముకున్న పార్టీ రుణం తీర్చుకునేందుకు డీజీపీ అసత్య ప్రచారం చేస్తున్నారు. సీఐడీ, సిట్ విచారణలతో సంబంధం లేకుండా సజ్జల పంపిన నివేదికపై మీడియా ముందుకు ఎలా వస్తారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడింది తానేనని చెప్పిన బ్రదర్ అనీల్ బృందంతో కలిసి పనిచేసిన ప్రవీణ్ చక్రవర్తిని ఎందుకు అరెస్టు చేయలేదు. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకంటే.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిదే నేరమా?. ఎవరిని రక్షించటం కోసం ఈ తొందరపాటు. జగన్‌ని సంతృప్తిపరచటానికి గీత దాటి వెళ్తున్నారేమో గౌతమ్ సవాంగ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి- వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
- డీజీపీ అవాస్తవాలు ప్రచారం
దేవాలయాల దాడులకు సంబంధించి తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికే తెదేపా, భాజపాలపై డీజీపీ ఆరోపణలు చేశారు. హైందవ మత మనుగడను ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోలేక అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే అసలు నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. ఓ ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ముందే హెచ్చరించినా డీజీపీ పట్టించుకోలేదు. మతిస్థిమితం లేని వాళ్లు విగ్రహాలు ధ్వంసం చేశారన్న డీజీపీ.. ఒక్కరోజులోనే జే-టర్న్ ఎలా తీసుకున్నారు- చినరాజప్ప, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు
- నిరూపిస్తే రాజీనామా చేస్తారా?
వినాయకుడి విగ్రహం అపవిత్రం ఘటనలో అసత్య ప్రచారం చేశారంటూ తన పీఏ సందీప్‌తో పాటు మరో ముగ్గురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ నాయకులతో కలిసి అదనపు ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.
హిందూ ధర్మాన్ని కాపాడలేని ప్రభుత్వం....తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం దారుణం. రాజమహేంద్రవరం పిడింగొయ్యి పరిధిలోని వెంకటగిరిలో వినాయకుడి విగ్రహాన్ని అపవిత్రం చేయలేదని డీజీపీ చెప్పారు. అపవిత్రం జరిగిందని నేను న్యాయస్థానానికి వెళ్లి నిరూపిస్తే డీజీపీ రాజీనామా చేస్తారా?. కోడిపందేలు, పేకాట, గుండాట, అశ్లీల నృత్యాల్ని అడ్డుకోలేని పోలీసులు ప్రతిపక్ష నాయకుల్ని మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారు. జైల్ భరోకి మేం సిద్ధం. ఎంతమందిని జైలుకి పంపుతారో చూస్తాం -గోరంట్ల బుచ్చయ్య, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే
ఇదీ చదవండి