వైకాపా ప్రభుత్వ అరాచక పాలన వల్లే అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉండటం విచారకరమని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక 2020 సంవత్సరంలోనే 889 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, సగటున రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని, దేశంలోనే 22 శాతం కౌలు రైతుల మరణాలు మన రాష్ట్రంలోనే అంటే, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. సున్నా వడ్డీ రుణాలని ప్రకటనలు ఇచ్చుకుని, ఇవ్వాల్సిన రుణాలకి సున్నా చుట్టేశారని విమర్శించారు. ఎరువులు-విత్తనాలు దొరక్క రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసి అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని పేర్కొన్న జగన్... మూడు రూపాయలు కూడా కేటాయించకుండా ద్రోహం చేశారని ఆక్షేపించారు.
వ్యవసాయ ఉచిత విద్యుత్‌కి మంగళం పాడిన జగన్... మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తోన్న వైకాపా పాలనలో రైతులకు ఆత్మహత్యలే గతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మహత్యలపై ఇప్పటికైనా వైకాపా సర్కారు కళ్లు తెరిచి, రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోకపోతే ఏపీ.. రైతుల్లేని రాష్ట్రంగా మారిపోనుందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: