ప్రజాసమస్యలపై పోరాటంలో వేగం పెంచుతున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మంగళగిరి నియోజకవర్గంపై దృష్టిసారించారు. ఇటీవల పార్టీ పనులు, రాష్ట్రవ్యాప్త పర్యటనలు పూర్తిచేసుకున్న ఆయన.. సొంత నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలతోనే కాకుండా ప్రజలనూ కలిసి, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
యువతతో సెల్ఫీలు..
ఇళ్ల కూల్చివేతల నుంచి ఫించన్ల నిలిపివేత వరకూ ప్రతి అంశంపైనా ప్రజలకు భరోసా ఇస్తున్నారు లోకేశ్. అన్నింటికీ కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రజాసంక్షేమం గురించి ఆరా తీస్తూ కలిసొస్తున్న యువతతో సెల్ఫీలు దిగుతూ, ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. లోకేశ్ పర్యటనల్లో నేతలు, కార్యకర్తల హడావుడి లేకుండా.. నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని కలిసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆర్థిక సహాయం అందజేత..
ప్రభుత్వ ఫలాలు దక్కనివారితోపాటు ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కొందరికి ఆర్థిక సాయమూ చేశారు. ముఖ్యంగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తల ఇళ్లలో ఏ శుభకార్యం ఉన్నా శుభాకాంక్షలు పంపుతున్నారు. పెళ్లిళ్లు ఉంటే బట్టలు పెట్టి మరీ అభినందనలు తెలుపుతున్నారు. కొవిడ్‌తో మృతిచెందిన ప్రతి కార్యకర్త ఇంటికీ వెళ్లి ఓదార్చారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ.. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న లోకేశ్ ను చూసి.. పార్టీ నేతలూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.
ఇళ్ల కూల్చివేతల అంశాన్ని ప్రజల్లోకి లోకేశ్ విస్తృతంగా తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో అభివృద్ధి నామమాత్రమనే అంశాన్నీ అర్థమయ్యేలా వివరించారు. ఇసుక కొరతతో నిలిచిన నిర్మాణాలను చూపిస్తూ.. ఉపాధి కోల్పోయిన కార్మికుల కష్టాలను అందరికీ తెలియజేశారు. ఈ విధంగా.. ప్రజల తరపున నిజమైన పోరాటం చేస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేశ్.
ఇవీచదవండి.