ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో స్పష్టం చేయాలని.... సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చును మంత్రి బుగ్గన వెల్లడించాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. గత బడ్జెట్‌లో జలయజ్ఞం అన్నారు.. ఇప్పుడు సాగునీటి రంగం అంటున్నారని మండిపడ్డారు. గోదావరి-పెన్నా అనుసంధాన పనులు ఎందుకు ఆలస్యం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెదేపా ప్రభుత్వం మొదలుపెట్టిన వాటికి మీరు పేర్లు పెట్టుకోవడం ఏంటని మండిపడ్డారు. వైకాపా నేతలు కృష్ణానదిలో ఇసుక దోపిడీ చేస్తున్నారని... అవనిగడ్డ నుంచి జగ్గయ్యపేట వరకు ఇసుక దోచుకుంటున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం చేసిన పనులను వైకాపా ప్రభుత్వం ఘనకార్యంగా చెప్పుకుంటుందని... తెదేపా తలపెట్టిన 62 ప్రాజెక్టుల గురించే ఇప్పుడు సమావేశాల్లో చెబుతున్నారని ఆరోపించారు. గోదావరిలోని 3 పాయల నుంచి శ్రీశైలానికి నీళ్లు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు.
తెదేపా ఐదేళ్ల పాలన నీటి పారుదలశాఖ చరిత్రలో స్వర్ణయుగమని దేవినేని అన్నారు. ఐదేళ్ల పాలనలో నీటిపారుదలశాఖలో రూ.63 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాచర్ల లిఫ్ట్ వరికశలపూడి కూడా తామే చేపట్టామన్నారు. పట్టిసీమను విమర్శించిన వైకాపాకు.. ఇప్పుడదే దిక్కయిందని అన్నారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం