మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దుందుడుకు చర్యకు పాల్పడిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య దుయ్యబట్టారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును నిమ్మాడలో ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తప్పు చేశారని ఆధారాలు చూపిస్తే స్వయంగా వచ్చి అరెస్ట్ అయ్యే నైతిక విలువలున్న వ్యక్తి అచ్చెన్నాయుడని వర్ల పేర్కొన్నారు.
శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని మందులు కూడా వేసుకోనియకుండా అరెస్ట్ చేయడం ఎంత వరకు సరైనదని.. మాజీఎంపీ మాగంటి బాబు ప్రశ్నించారు. విచారణ లేకుండా ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం సబబు కాదని హితవుపలికారు.
అసెంబ్లీలో ఎదుర్కొనే దమ్ము లేకనే జగన్ సర్కారు తెదేపా నేతలను టార్గెట్ చేస్తోందని... తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలలో వైకాపాని అడ్డుకుంటారనే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని దుయ్యబట్టారు.
అచ్చెన్నాయుడు అరెస్టును మాజీమంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు. విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని... ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ఒక బీసీ నేతగా గళం విప్పడమే అచ్చన్న చేసిన తప్పా అని... మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలని వైకాపా ప్రభుత్వం కుట్రను అమలు చేసిందని ఆరోపించారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: న్యాయ పోరాటం చేస్తాం: రామ్మోహన్‌నాయుడు