కబ్జాలు, దోపిడీలు చేసే అరాచకశక్తులు రాజధాని మారుస్తారని ఎన్నికల ముందు చెప్పిన బొత్స.. ఇప్పుడు రాజధానిని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలి. జగన్ అరాచకవాది, కబ్జాకోరని బొత్స ఇప్పుడు ఒప్పుకున్నట్లేనా..? ఏకవచనంతో నోరేసుకొని చంద్రబాబుపై పడకుండా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైకాపాపై ఉంది. ప్రజాభిప్రాయం కోసం శాసనసభను రద్దుచేసి, ఎన్నికలకు వెళ్లి, తన నిర్ణయాలను జగన్ అమలు చేయవచ్చు. -వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
రాజధాని మార్చమని చెప్పి ఇప్పుడు మోసం చేసినందుకు ప్రజాభిప్రాయం కోరకుండా తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని వైకాపా అనటం వారి మూర్ఖత్వం. అమరావతిని మారుస్తూ వితండవాదం చేస్తున్న వైకాపా నేతలు ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి. మాట మార్చినందుకు ప్రజాభిప్రాయం కోరాల్సింది వైకాపా నేతలే. సచివాలయం, డీజీపీ కార్యాలయం ఇతర ప్రధాన పరిపాలనా కేంద్రాలు ఇప్పుడు సొంత భవనాల్లోనే సాగుతుంటే అదనపు ఖర్చు ఎందుకు పెడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయటం తప్ప మరొకటికాదన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తుంది. రాజధానితో పని ఉన్న ఒక సామాన్యుడు రాయలసీమ నుంచి విశాఖ వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడతారు. -కాల్వ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యులు
రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై రాజీనామాలకు మా ఎమ్మెల్యేలు సిద్ధం. మరి వైకాపా సిద్ధమా..? మాట తప్పిన జగన్ దీనికి సిద్ధమో కాదో సమాధానం చెప్పాలి.- అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇదీ చదవండి: కరోనా సోకి సీపీఎం నేత సున్నం రాజయ్య మృతి