స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. తెదేపా శ్రేణులపై దౌర్జన్యాలకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నామినేషన్లు వేసే తెదేపా అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్డింగ్‌లు ఇప్పటివరకు తొలగించకపోవడం ఎస్‌ఈసీ వైఫల్యమని పేర్కొన్నారు. సమయానికి కుల ధ్రువపత్రం ఇవ్వకపోతే దానికి ఎస్‌ఈసీదే బాధ్యత వహించాలన్నారు.
ఎన్నికల కోడ్ వర్తించదా
ఎన్నికల కోడ్ సీఎం జగన్‌కు వర్తించదా అని చంద్రబాబు నిలదీశారు. పాఠశాల వసతుల కల్పనపై సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రిజర్వేషన్లను ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మీడియా సమావేశంలోకి ప్రభుత్వ అధికారి ఎలా వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ పక్కన విజయ్‌కుమార్‌కు ఏం పని అని నిలదీశారు.
అన్ని ప్రయత్నాలు చేస్తాం
ప్రజాస్వామ్యం కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు.. వైకాపా రంగులు తొలగించేందుకు... రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. ఈ నిధులు వైకాపా నేతలు కడతారా అని ప్రశ్నించారు. ఇలా పార్టీ రంగులు వేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
పలు ప్రాంతాల్లో తెదేపాను వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించిన చంద్రబాబు.. అందుకు ఆధారంగా పలు వీడియోలు ప్రదర్శించారు. సూళ్లూరుపేట, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో.. వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలను వదిలిపెట్టమని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి: