ఎన్టీఆర్(NTR) వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభివర్ణించారు. ఎన్టీఆర్ 98వ జయంతి(NTR Birth Anniversary) సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్, దేవాన్ష్లతో కలిసి బాబు నివాళులర్పించారు. ఎన్టీఆర్ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా మారారని ప్రశంసించారు. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని చంద్రబాబు కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్ నటించలేదు.. జీవించారన్నారు.
ప్రజలకు ఏం కావాలో ఆలోచించి పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు తెలిపారు. చౌకబియ్యం, పేదలకు ఇళ్లు, గురుకులాలను ఎన్టీఆర్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరుగా ఎన్టీఆర్ను ప్రశంసించిన బాబు... తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తిగా కొనియాడారు.