భాజపా తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ (tarun chugh) మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender )ను శామీర్‌పేటలోని ఆయన నివాసంలో కలిసారు. ఆయనతో పాటు ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, రమేష్ రాథోడ్, ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కలిశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వత్థామరెడ్డి, కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ ఈటలతో పాటు ఉన్నారు.
అహంకారపూరితమైన వ్యక్తి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతుందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. 20 ఏళ్లు కలిసి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని అక్రమంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేశారన్నారు.
ఈటలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం..
భాజపాను తెలంగాణను బలోపేతం చేయడానికి ప్రజా నాయకుడు ఈటల రాజేందర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయనను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను. అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు శాసనసభలో పోరాటం చేసిన నాయకుడు తెరాసను వీడుతున్నారు. ఆయనతో పాటు భాజపాలో చేరే నాయకులందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. - తరుణ్ చుగ్, భాజపా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
ఇదీ చదవండి: