ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు సభ్యులు..విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదని ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటివారిని ప్రోత్సహించడం తగదని సూచించారు.
" చంద్రబాబు, అతని కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు సరికాదు. అలాంటి నేతలను సభానాయకుడే ప్రోత్సహించడం తగదు. రాజకీయాల్లో విధానాలపైనే విమర్శలు ఉండాలి. అసభ్య పదజాలాన్ని మేధావులు, విద్యావంతులు ఖండించాలి. వ్యక్తిత్వం లేనివారిని చట్టసభలకు పంపితే ఇలాగే ఉంటుంది. రాజకీయాల్లో విలువల రక్షణకు నేతలంతా ప్రయత్నించాలి. " - సుజనా చౌదరి
రాజకీయాల్లో విమర్శలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తులు, కుటుంబాలన మీద కాదన్నారు. ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేనన్నారు.
ఉన్నత విలువలతో, సంస్కారవంతమైన భాషతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయమన్నారు సుజనా. రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివేచన కలిగినవారంతా ఇలాంటి ఘటనలను ఖండించాలన్నారు. వ్యక్తిత్వం లేనివారిని చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే ఉంటాయన్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే దిగజారుడు నేతలను దూరం పెట్టాలన్నారు. లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయనాయకులన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకునే ప్రమాదం వుందని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా నేతలంతా రాజకీయాల్లో విలువలను కాపాడేందుకు ప్రయత్నించాలని కోరారు.
ఇదీ చదవండి : CHANDRABABU:'ఇది గౌరవ సభా..కౌరవ సభా'..: చంద్రబాబు