రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం సహకరిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు... రెండో విడతలో కేంద్రం కేటాయించిన బియ్యాన్ని రాష్ట్రాలు తీసుకెళ్లాలని చెప్పారు. కేంద్రం కేటాయించిన పప్పుధాన్యాలను కొన్ని రాష్ట్రాలు తీసుకెళ్లలేదని తెలిపారు. వాటిని వెంటనే పేదలు, వలస కూలీలకు అందించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కోరారు.
జన్‌ధన్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేశామన్న మంత్రి... రాష్ట్ర విపత్తు నిధి కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చామన్నారు. కరోనా సాయం కింద ఏపీకి రూ.179 కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. ఏపీలోని రైతుల ఖాతాల్లో రూ.918 కోట్లు జమచేశామన్నారు. మహిళల సంక్షేమానికి రూ.300 కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు రూ.196 కోట్లు సాయం చేశామని వివరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద ఆంధ్రప్రదేశ్ కే రూ.550 కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు.
గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను ఆదుకుంటున్నామన్న కిషన్ రెడ్డి... సీఎం జగన్, ఉన్నతాధికారులతో తానే స్వయంగా మాట్లాడానని తెలిపారు. గుజరాత్ సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అమిత్‌షాను కోరినట్లు చెప్పారు. 4,069 మంది ఏపీ మత్స్యకారులను పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మత్స్యకారులు 54 బస్సుల్లో బయలుదేరి ఏపీకి వెళ్లారని చెప్పారు.
వలస కూలీల విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రావాలని అభిప్రాయపడ్డారు. పనిచేసే రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలకు ఆహారం, వసతి కల్పిస్తున్నామన్నారు. వారికి ఆరోగ్య పరీక్షలు చేసి త్వరగా సొంత రాష్ట్రాలకు పంపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. బ్యాంకులకు 3 నెలలపాటు వాయిదాలు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 3 నెలల తర్వాత వడ్డీ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా కట్టడి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలని రాష్ట్రాలను కోరుతున్నామన్నారు.
ఇవీ చూడండి: