గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల లేఅవుట్లు వెలుస్తున్నాయని, వాటికి సంబంధించి ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని పంచాయతీల్లోనూ లేఅవుట్లపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్ల పై పరిశీలనకు ప్రతి మండలానికి ఒక అధికారిని కేటాయిస్తున్నామని, ప్రత్యేకంగా లేఅవుట్ల పరిశీలన బాధ్యతలను అప్పగిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి పర్యవేక్షణలో మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు.
అనధికారిక లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తీసుకువస్తామని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో పంచాయతీలు ఉన్నాయని, ఈ పంచాయతీ స్థలాలకు అనుమతులకు సంబంధించి చెల్లిస్తున్న ఫీజుల్లో సగం పంచాయతీలకు రావాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు యుడిఎలతో మాట్లాడి రావాల్సిన డెవలప్‌మెంట్ ఫీజులను వసూలు చేయాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవెన్యూ ప్లాంటెషన్ చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం