కొవిడ్ వల్ల తలెత్తిన సమస్యలపై విమర్శనాత్మక కథనాలను ప్రసారం చేసిన టీవీ ఛానళ్లపై రాజద్రోహం కేసు పెడతారా? అంటూ అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. విమర్శనాత్మక కథనాల విషయంలో వారి వైఖరిని సోమవారం ప్రశ్నించింది. ‘కొవిడ్‌తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని నదిలో విసిరేస్తున్న దృశ్యాలను మేము చూశాం. వాటిని ప్రసారం చేసిన టీవీ ఛానల్‌పై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారో లేదో నాకు తెలియదు’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొవిడ్‌తో మృతి చెందినవారికి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరగాలంటూ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. ఈ అంశంపై స్పందిస్తూ.. జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో చాలా శ్మశానవాటికలు ఉన్నా.. వాటిలో ఎక్కువ శాతం వినియోగంలో లేకపోవడం బాధాకరమని మీనాక్షి అరోరా పేర్కొన్నారు.
దీంతో మృతదేహాలకు అంతిమ సంస్కారం గౌరవప్రదంగా జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు వైరస్‌వ్యాప్తితో ప్రజలు ఆందోళనలో ఉంటే.. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం పేదలకు తలకు మించిన భారంగా పరిణమించిందని ఆమె వివరించారు. కొవిడ్ సంబంధిత సమస్యలకు సామాజిక మాధ్యమాల్లో సహాయం కోరినవారిపై కేసులు నమోదు చేయడాన్ని ఇంతకుముందే సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనూ విమర్శించింది.
ఇదీ చదవండి: