విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గ్యాస్ దుర్ఘటనను జాతీయ హరిత ట్రైబ్యునల్ సుమోటోగా విచారణకు స్వీకరించడాన్ని సవాలు చేస్తూ.. ఎల్జీ సంస్థ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ధర్మాసనం జూన్ 8కి విచారణను వాయిదా వేసింది.
ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే విచారణ కోసం సుమారు 7 కమిటీలను వేశారని.. వీటిలో ఎన్జీటీ, జాతీయ మానవహక్కుల సంఘం, రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎల్జీ సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇన్ని కమిటీలు ఎందుకు వేశారో అర్థం కాలేదన్న పిటిషనర్.. ఎన్జీటీ ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఎన్జీటీ కమిటీ తమ ప్లాంటుకు వచ్చే విషయంపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయపరమైన అంశాలపై తమకు అనుమానాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే..న్యాయపరమైన విషయాలను ప్రస్తావించేందుకు అవకాశం కల్పించాలని జస్టిస్ లలిత్ ధర్మాసనాన్ని ఎల్జీ తరపు న్యాయవాదులు కోరారు. ఎన్జీటీలో తదుపరి విచారణ జూన్ 1న ఉందని తెలుపగా.. న్యాయపరమైన విషయాలను లేవనెత్తేందుకు అనుమతి ఇస్తూ.. కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్.. వృద్ధురాలికి అరెస్ట్ నోటీసులు