నీట్ పరీక్ష పూర్తయి, సమాధాన పత్రం కూడా విడుదలవడంతో.. విద్యార్థులకు తమకెన్ని మార్కులు వస్తాయనే స్పష్టత వచ్చేసింది. భారత్‌లో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు రాదని తెలిసినా కూడా.. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లడానికి అత్యధికులు ఆసక్తి చూపించడం లేదు. అక్కడకు ఎప్పుడు వెళ్తామో తెలియని ప్రస్తుత స్థితిలో.. వచ్చే నీట్ కోసం సన్నద్ధమవడం మేలనే భావనలో కొందరున్నారు. మరికొందరు మాత్రం వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులను సంప్రదిస్తున్నారు. అక్కడి వాతావరణం, ఆహారంపై ఆరా తీస్తున్నారు. నేరుగా తరగతులు ప్రారంభమయ్యే వరకూ ఆన్‌లైన్‌లోనే నేర్చుకుంటూ.. విదేశాలకు అనుమతి లభించినప్పుడు వెళ్లాలనే ఆలోచనతో ఇంకొందరున్నారు.
ఖర్చు రూ.30 లక్షల లోపేనని...
ఏటా మన దేశం నుంచి చైనా, ఉక్రెయిన్, నేపాల్, ఫిలిప్పీన్స్, రష్యా, హంగేరీ, బల్గేరియా, కరేబియన్ దీవులు, కిర్గిస్థాన్ తదితర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 20 వేలకు పైనే ఉంటోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 3,000 మంది వరకూ ఉంటారని తెలుస్తోంది. మన దేశంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి కనీసం రూ.75 లక్షల నుంచి రూ.85 లక్షలకు పైగానే ఖర్చవుతుండగా.. చాలా దేశాల్లో గరిష్ఠంగా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల్లోపే అవుతోంది. మన దేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు పొందలేని విద్యార్థుల్లో కొందరు విదేశాలవైపు చూస్తుంటారు.
అతి స్వల్ప సంఖ్యలో..
ప్రతికూల పరిస్థితులనూ కొందరు విద్యార్థులు తమకు అనుకూలంగా మలచుకొని వైద్య విద్య వైపు అడుగులేస్తున్నారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు గురించి అడిగేవారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. కొవిడ్ ఉద్ధృతి తగ్గితే గానీ విదేశీ విద్యకు పూర్వ స్థాయిలో ముందుకు రారు. - డాక్టర్ సతీష్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ అబ్రాడ్ సంస్థ
- ఇదీ చదవండి: ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలి: మురళీమోహన్