ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ పోర్టు తర్వాత అత్యధిక ప్రాధాన్యమున్న గుంటూరు జిల్లా నిజాంపట్నం పోర్టుకు కనెక్టివిటీని పెంచి జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఎంపీలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకట రమణరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు దిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
గుంటూరు నుంచి నారాకోడూరు, తెనాలి, చందోలు– నిజాంపట్నం హార్బర్‌కు ప్రస్తుతమున్న మార్గాన్ని జాతీయ రహదారిగా ఆమోదించి అభివృద్ధి చేయాలని ఎంపీలు కోరారు. 61 కిలోమీటర్లు మేర ఉన్న ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. వ్యవసాయం, వాణిజ్యం, ప్రజారవాణాలో కీలక ప్రాధాన్యత గల కొండమోడు–పేరేచర్ల, దాచేపల్లి–మాచర్ల మార్గాలను జాతీయ రహదారులుగా ఆమోదించి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి బాటలు వేసారంటూ కేంద్రమంత్రికి ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు..
ఇదీ చదవండీ.. CBN: దేవినేని ఉమా వాహనంపై దాడిని ఖండించిన చంద్రబాబు