విద్యార్థుల అభ్యాసన ఫలితాల మదింపు విధానంలో సమూల మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. తూతూ మంత్రంగా పరీక్షలు జరిపి.. ఇష్టారాజ్యంగా మార్కులు, గ్రేడ్లు, ఇవ్వవద్దని.. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ ఈసారి విద్యా సంవత్సరాన్ని.. టర్మ్-1, టర్మ్-2లుగా విభజించి.. రెండుసార్లు బోర్డు పరీక్షలు జరుపుతామంది. తొలి 6 నెలల పరీక్ష.. నవంబర్-డిసెంబర్లో సగం సిలబస్‌కు నిర్వహించాలని చూస్తోంది. ఇవి బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉంటాయని తెలిపింది. రెండో దశ పరీక్ష మిగిలిన సగం సిలబస్‌కు నిర్వహిస్తామంది. ఈ రెండింటిలో వచ్చిన మార్కులను.. పరిగణలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది.
సీబీఎస్ఈ ప్రకటించినట్లుగా రాష్ట్రంలోనూ రెండుసార్లు బోర్డు పరీక్షలు జరిపే విధానం సాధ్యాసాధ్యాలపై అధికారులు చర్చిస్తున్నారు. సాధారణంగా నాలుగు ఫార్మాటివ్ అసెస్మెంట్లు, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్.. ఎస్ఏ-1తో పాటు.. వార్షిక పరీక్షలు ఎస్ఏ-2 జరుపుతారు. అయితే.. గత రెండేళ్లుగా వార్షిక పరీక్షలు జరగలేదు. గత విద్యా సంవత్సరం 2020-21 ఎస్ఏ-1 ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇచ్చారు. సాధారణంగా ఎస్ఏ-1ను జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నాపత్రాలు తయారు చేసి పంపిస్తుంది. ఈసారి సీబీఎస్ఈ మాదిరిగానే.. వాటిని బోర్డు తయారు చేసి పంపిస్తే.. ఎలా ఉంటుందనే దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.
మరో పక్క రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం ఉంటేనే.. తుది పరీక్షలకు వెయిటేజీ ఉండడంలో హేతుబద్ధత ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. వచ్చే నవంబర్-డిసెంబర్ వరకు ప్రత్యక్ష బోధన లేకుంటే.. అప్పుడు ఇళ్ల నుంచే ఆన్లైన్, ఆఫ్‌లైన్ పరీక్షలు జరపాలని.. సీబీఎస్ఈ నిర్ణయించింది. అది రాష్ట్రంలో సాధ్యపడుతుందా..? అన్న ప్రశ్న అధికారుల్లో తలెత్తుతుంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. త్వరలో ఎస్సీఈఆర్టీ, ఎస్ఎస్సీ బోర్డు అధికారుల సమావేశం ఉంటుందని.. అందులో వీటి గురించి చర్చిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.