జన్యువులు, ప్లాంట్ బ్రీడింగ్ వంటి అంశాలపై చదువుకున్న నీతూ వచ్చేనెల పశ్చిమబెంగాల్‌లోని జాతీయ జనపనార పరిశోధనాసంస్థలో పరిశోధనలు చేసేందుకు వెళ్తోంది. అయితే ఆమె చదువు, ఉద్యోగానికి మధ్య... నార్మ్‌లో ఓ ప్రత్యేకమైన శిక్షణ పూర్తిచేసుకుంది. ఆమె తీసుకున్న ఈ శిక్షణ నాలుగ్గోడల మధ్య చెప్పేమామూలు పాఠంలాంటిది కాదు... రైతుల కష్టాలని నేరుగా చూసింది. వాళ్లు అనుసరించే వ్యవసాయ విధానాలని తెలుసుకుంది. ఇందుకోసం తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల్లోని రైతులని కలిసింది. అభ్యుదయ రైతులు ఇచ్చిన సలహాలూ తీసుకొంది. స్వయంసహాయక సంఘాల మహిళలని కలిసి వాళ్లకేం కావాలో తెలుసుకుంది.
‘గ్రామీణ రైతులకు ఐటీ, కృత్రిమమేధ, మొబైల్‌టెక్నాలజీ, మార్కెటింగ్ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ల ముఖాల్లో సంతోషం చూడాలన్నదే నా లక్ష్యం’ అంటోంది నీతూ. ఆవులూ, గేదెల పెంపకంలో వచ్చే లాభాల గురించి మనకు తెలుసు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని జడలబర్రె(యాక్)లు కూడా ఈ రకమైన సంపదనే రైతులకు అందిస్తాయి. అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ ద్వారా శాస్త్రవేత్తగా ఎంపికైన డాక్టర్ అనీత్‌కౌర్ జడలబర్రెలపై పరిశోధన చేసేందుకే వచ్చేనెల అక్కడకు వెళ్తోంది. నీతూ, అనీత్‌లు మాత్రమేకాదు... భారతీ పాండే, నీలిమా సింగ్ లాంటి అమ్మాయిలంతా సాగుపైన మక్కువతో శాస్త్రవేత్తలుగా మారి ఈ శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రధానంగా కొత్త వంగడాల సృష్టి, సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక యంత్రాల రూపకల్పన, పెట్టుబడుల తగ్గింపు... వంటి అంశాలపైన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సాంకేతిక వినియోగంతో సాగుని లాభదాయకంగా మార్చడమే వీళ్ల లక్ష్యం. ఐటీ, కృత్రిమ మేధ రంగాల్లో పరిశోధనలతో రైతు సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకున్నారు.
‘తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగత రుణాలు, రవాణా, నిల్వ, ఈ-మార్కెటింగ్... వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతులకు ఆదాయం పెరగడం లేదు. వీటికి పరిష్కారంగా ఆధునిక ఆవిష్కరణలు, యంత్రాలు రావాలి.’ అంటారు భారతీ పాండే. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వీరంతా దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: