రాజ్యాంగానికి మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలు ప్రాథమికంగా స్వతంత్రమైనవి కానప్పటికీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆ వాస్తవాన్ని వ్యవస్థలు మరిచిపోతున్నాయన్నారు. వ్యవస్థలు ఉన్నది ఒకదానితో ఒకటి ప్రతిఘటించుకోవడానికి కాదన్నారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియాలో బుధవారం మొదలైన 80వ అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర శాసనసభలో జరిగిన ప్రక్రియను అవకతవకల విధానంగా పేర్కొనలేమని అధికరణ 212 స్పష్టం చేస్తోంది. శాసన ప్రక్రియలో కోర్టుల విచారణను ఈ అధికరణ స్పష్టంగా నిలువరిస్తుంది. శాసన చర్యలను తప్పుపడుతూ చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు తీర్పులిస్తున్నాయి. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలను గౌరవిస్తూ శాసన వ్యవస్థ మౌనం వహిస్తోంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై శాసనసభలో చర్చించాక శాసన మండలి ఆమోదం కోసం పంపారు. ఈ విషయంలో రెండు సభల మధ్య కొంత ఇబ్బంది తలెత్తింది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో స్పష్టమైన నిబంధనలున్నాయి. అయినా ఈ అంశంపై కోర్టులను ఆశ్రయించడం వల్ల చట్టాల పురోగతి నిలిచిపోయింది. ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యాన్ని కోరడం రాజకీయ ప్రతీకారాన్ని సాధించడం కోసమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు విచారణ ప్రారంభించడానికి ముందే ఈ చర్యల వెనుకున్న ప్రేరణను గ్రహించాలి. సున్నితమైన అంశం తలెత్తినప్పుడు వ్యవస్థలు తమ పరిధా కాదా అన్నది మరిచిపోయి వ్యాఖ్యలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి. స్వీయ నియంత్రణ పాటించడం, వ్యాఖ్యానించడానికి ముందు ఆత్మపరిశీలన చేసుకోవడానికి వ్యవస్థలు కట్టుబడితే ప్రతిఘటనే ఉత్పన్నం కాదు- తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్
ఇదీ చదవండి