Old age pension: వైఎస్సార్ పింఛను కానుక కింద ప్రతి నెలా అందిస్తున్న మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలకొకసారి 6 దశల తనిఖీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కొత్త పింఛన్ల మంజూరు సమయంలో అప్పటి వరకు పింఛను తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాల్ని తనిఖీ నిర్వహించి వడపోస్తోంది. ఆదాయ పరిమితి, విద్యుత్తు వినియోగం, భూమి, ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయ పన్ను చెల్లింపు, పట్టణ ప్రాంతాల్లో ఇంటి విస్తీర్ణం, తదితర వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేసి ఏమాత్రం అనుమానం ఉన్నా పక్కన పెడుతోంది. తాజాగా నిర్వహించిన వడపోత ప్రక్రియలో భారీగానే అనర్హులు తేలినట్లు తెలుస్తోంది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించిన పింఛను పంపిణీ జాబితాను పరిశీలిస్తే 60 వేల పింఛన్ల వరకు తేడా కనిపిస్తోంది. అయితే ఎంత మంది అనర్హులుగా మారింది బయటకు తెలియకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
యాప్‌లో కొన్ని పేర్లు గల్లంతు: సోమవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభించగా కొన్ని సచివాలయాల పరిధిలో కొంతమంది పేర్లు యాప్‌లో కనిపించలేదు. దీంతో గత నెల వరకు అందిన పింఛన్లు ఇప్పుడెందుకు నిలిపేశారని లబ్ధిదారులు పలు చోట్ల వాలంటీర్లను ప్రశ్నించారు. పింఛను నిలిపివేతకు అధికారులు కారణాన్ని పేర్కొనక పోవడంతో వాలంటీర్లు... లబ్ధిదారులకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల సచివాలయ సిబ్బందితోనూ లబ్ధిదారులు వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 17 రకాల పింఛన్లను అందిస్తుండగా నిలిపేసిన వాటిలో ఎక్కువగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లు ఉన్నట్లు తెలిసింది. పొరుగు సేవల సిబ్బంది కుటుంబ సభ్యులుగా ఉన్న లబ్ధిదారుల పింఛన్లు కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిపేశారు. జూన్ 1వ తేదీన పంపిణీతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో కొత్తగా 3.10 లక్షల పింఛన్లు మంజూరు చేసినప్పటికీ ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, వైద్య(డీఎమ్‌హెచ్‌వో) పింఛన్లకు సంబంధించి తగ్గుదల కనిపించింది. ఒంటరి మహిళల పింఛన్లు 8 వేలు, చేనేత కార్మిక పింఛన్లు 3 వేలు, డీఎమ్‌హెచ్‌వో పింఛన్లు వెయ్యి వరకు తగ్గాయి.
గతానికి భిన్నంగా: మొన్నటి వరకు 6 దశల తనిఖీలో ఎందుకు అనర్హులుగా మారారో సూచిస్తూ నోటీసులు జారీ చేసేది. అర్హత ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు 7 రోజుల్లో సచివాలయాల్లో అందించాలని సూచించేది. అధికారుల తనిఖీ తర్వాత అర్హులుగా తేలితే మళ్లీ పింఛన్లు మంజూరు చేస్తామని వెల్లడించేది. ఆ నోటీసులు సచివాలయ సంక్షేమ కార్యదర్శులు అనర్హులుగా తేలిన వారికి ఇచ్చేవారు. కానీ ఈ దఫా ఎలాంటి కారణం తెలియజేయకుండానే కొంతమంది పేర్లను నిలిపేశారు. సోమవారం సాయంత్రం వరకు కొందరికి నోటీసులు సచివాలయ సంక్షేమ కార్యదర్శి లాగిన్‌లోకి చేరలేదు. అనర్హతకు కారణాలు తెలుపుతూ నేడో, రేపో నోటీసులు జారీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్లు పలువురు సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు.
ఇవీ చదవండి: