'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కమిషన్ రెండో రోజూ విచారిస్తోంది. కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సజ్జనార్ సమాధానమిస్తున్నారు. 2019 డిసెంబర్ 6వ తేదీ ఉదయాన ఎన్‌కౌంటర్ గురించి శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తనకు చెప్పాడని సజ్జనార్ స్పష్టం చేశారు. విషయం తెలుసుకొని ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతమైన చటాన్‌పల్లికి వెళ్లినట్టు సిర్పుర్కర్ కమిషన్‌కు వివరించారు.
మెజిస్ట్రేట్ సమక్షంలోనే పంచనామా..
సైబరాబాద్ కమిషనరేట్‌కు న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్న అడ్వకేట్ సూచన మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు సజ్జనార్ సూచించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో నిర్వహించిన మీడియా సమావేశంలోని పలు అంశాలను కమిషన్ ప్రస్తావించి వివరణ కోరింది. తెలుగు తన మాతృభాష కానందున ఆ సమయంలో కొన్ని తప్పుగా మాట్లాడినట్లు సజ్జనార్ వివరించారు.
కొనసాగుతోన్న విచారణ...
దిశ హత్యాచారం, నిందితుల అరెస్ట్, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించే ప్రక్రియను అంతా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షించారని సజ్జనార్ కమిషన్‌ను తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను.. ప్రతి రోజు జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో ప్రకాశ్ రెడ్డి వివరించారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత పోస్టుమార్టం, మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాలపై... కమిషన్ తరఫు న్యాయవాదులు సజ్జనార్‌ను విచారిస్తున్నారు.
మొదటి రోజు విచారణలో...
దిశ హత్యాచార ఘటన గురించి శంషాబాద్ డీసీపీ తనకు చెప్పాడని.. కేసును అతనే పర్యవేక్షించాడని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) సిర్పుర్కర్ కమిషన్ (justice sirpurkar commission)కు మొదటిరోజు విచారణలో వివరించారు. నిందితులను గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని.. కేసు పురోగతి గురించి శంషాబాద్ డీసీపీ ప్రతి రోజు ఉదయం జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడని సజ్జనార్ కమిషన్‌కు తెలిపారు. ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా 2019 నవంబర్ 29న శంషాబాద్ విమానాశ్రయం వరకు వెళ్లి వస్తుంటే.. అదే రోజు నిందితులను పట్టుకున్న విషయాన్ని డీసీపీ చెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు మీడియాకు తెలిపానని కమిషన్ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానమిచ్చారు.
పలువురి విచారణ పూర్తి..
కమిషన్ సభ్యులు ఇప్పటికే హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డితో పాటు పోస్టుమార్టం నిర్వహించిన దిల్లీ ఎయిమ్స్, గాంధీ ఆస్పత్రి వైద్యులు, క్లూస్ టీం అధికారి వెంకన్నను విచారించారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్(Disha encounter case) సయమంలో ఎదురుకాల్పుల్లో గాయపడ్డ పోలీసులకు చికిత్స అందించిన కేర్ ఆస్పత్రి వైద్యుడిని కూడా కమిషన్ విచారించింది. షాద్‌నగర్ కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ రావును కూడా కమిషన్ విచారించింది.
సంబంధిత కథనాలు: