ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, డిగ్రీలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని, పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన అమలు, డిగ్రీ, పీజీలో యాజమాన్య కోటా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు ‘చలో కలెక్టరేట్’ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడంతో కొన్నిచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరికొన్ని చోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, పోలీసుస్టేషన్లకు తరలించారు. అనంతపురం, నెల్లూరు, గుంటూరులో ఆందోళనకారులను అరెస్టు చేశారు. కాకినాడలో బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అడ్డంగింతలు.. అరెస్టులు..
అనంతపురం కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. గుంటూరులో హిందూ కళాశాల కూడలి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన విద్యార్థులు పోలీసులను దాటుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి వ్యానులో ఎక్కించారు. అనంతరం నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మచిలీపట్నం ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. కాకినాడ బాలాజీ చెరువు కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన జరిగింది. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. విజయనగరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి:
CONTRACT FACULTY: ఎయిడెడ్ సిబ్బంది, సాధారణ బదిలీలతో ఒప్పంద అధ్యాపకులకు గండం