నాగార్జునసాగర్ డ్యామ్‌పై భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పోలీస్ అధికారులు తెలిపారు. నిన్న భద్రత ఏర్పాట్లను సూర్యపేట జిల్లా ఎస్పీ రంగనాథ్ సమీక్షించారు. ఇప్పటికే విధుల్లోఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు 100 మందిని అదనంగా మోహరించారు. జలాశయం ప్రధాన ద్వారం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులోనూ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాంపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ.. తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా సంపూర్ణ సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంధనశాఖ ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్‌ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదులు, కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను వివరిస్తూ సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇవీ చూడండి: