ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకపోవడాన్ని సవాల్ చేస్తూ భాజపా నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై దృశ్యమాధ్యమ విధానంలో విచారణ నిర్వహించింది. తొలుత న్యాయస్థాన సహాయకుడు (అమికస్ క్యూరీ) విజయ్ హన్సారియా హైకోర్టులు పంపిన సమాచార వివరాలు చదివి వినిపించారు. సమాచారాన్ని క్రోడీకరిస్తున్నందువల్ల కేసుల వివరాలు సమర్పించడానికి మరికొంత సమయం కావాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. కోర్టు గత ఉత్తర్వులకు అనుగుణంగా వివిధ హైకోర్టులు పంపిన సమాచారాన్ని అఫిడవిట్ సమర్పించినట్లు అమికస్ క్యూరీ చెప్పారు. కోర్టులు, కేంద్ర ప్రభుత్వం తాము అడిగిన రీతిలో వివరాలు పంపలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలి..
కేసుల సత్వర విచారణకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కావాలని హైకోర్టులు అడుగుతున్నందున దానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ రమణ సూచించారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆదాయం పడిపోయి రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున కేంద్రమే సానుకూల వైఖరి కనపరచాలన్నారు. కేసుల పరిష్కార రేటు అంశం కోర్టుల భౌగోళిక స్థానాలపై (జియాగ్రఫిక్ లొకేషన్) ఎంతమేరకు ఆధారపడి ఉందో చెప్పాలని గత విచారణ సమయంలో అడిగితే ఇంతవరకు ఒక్కరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. తామొక తాత్కాలిక నమూనా పత్రం రూపొందించామని, దాని ప్రకారం హైకోర్టుల వారీగా పెండింగ్ కేసుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న ప్రత్యేక కోర్టులు, అవసరమైన మౌలిక వసతుల వివరాలను సూటిగా నింపి పంపాలని ఆదేశించారు. దాని ఆధారంగా రాష్ట్రాల వారీగా సమస్యలపై స్పష్టత వస్తుందన్నారు. కేసుల్లో నిర్దిష్ట కాలపరిమితితో సమన్లు జారీచేసేలా అన్ని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని మెహతా కోరారు. వనరులు పెద్ద సమస్యేమీ కాదని, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని భరిస్తాయని చెప్పారు. కోర్టు ఆదేశించిన వివరాలు విభిన్న మార్గాల నుంచి రావాల్సి ఉన్నందున, పది రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దాంతో ధర్మాసనం ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.
అనేక విషయాలపై స్పష్టత లేదు. ఒకవైపు కేసులను వేగంగా విచారించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతూ వస్తున్నారు. మరోపక్క పెండింగ్ కేసులు మాత్రం ప్రజల నెత్తిన వేలాడుతున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకొని వివరాలు సమర్పించాలి. పోలీసులు చాలా కేసుల్లో ప్రజాప్రతినిధులకు భయపడి చట్టాలను అమలు చేయట్లేదు. ఇది చాలా తీవ్రమైన విషయం. కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించాలి. -కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ రమణ వ్యాఖ్యలు
ఇదీ చదవండి: ఆంగ్లమాధ్యమం అంశంలో ఏపీ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ