గత ఐదు నెలలకు పైగానే..
సెప్టెంబర్ నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చినా అవసరాల మేర ఇసుక లభించటం లేదు. డిమాండ్ ఎక్కువగా ఉండటం... సరఫరా ఆ మేరకు లేకపోవటంతో ఇసుక బంగారమై కూర్చుంది. దీంతో చాలామంది భవన నిర్మాణదారులు పనులు నిలిపివేశారు. అలాగే సొంతిళ్లు కట్టుకునేవారు సైతం మధ్యలో పనులు అపేశారు. పెద్దపెద్ద వ్యాపారులు అయితే ఎలాగోలా నిలదొక్కుకుంటారు కానీ... రోజువారీ కూలీలది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు పని చేసి వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాని పోషించుకోవాల్సి వస్తోంది. పనులు లేకపోవటంతో వీరంతా అప్పుల పాలయ్యారు. నాలుగు నెలల నుంచి తెచ్చిన అప్పులు పెరిగిపోవటం... ఇప్పటికీ పనులు దొరకకపోవటం భవన నిర్మాణ కార్మికులను నైరాశ్యంలోకి నెడుతోంది.
ఈ జిల్లాల్లోనే ఎక్కువ..
ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయ పనులు చేయలేని వారంతా ఈ భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో భవన నిర్మాణ కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటోంది. కేవలం ఈ రెండు జిల్లాల నుంచే కాకుండా ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా వచ్చి కార్మికులు ఇక్కడ భవన నిర్మాణ రంగంలో పని చేస్తుంటారు. రాజధాని ప్రాంతం కావటంతో ఇక్కడ పనులు బాగా జరిగేవి. అయితే అమరావతి విషయంలో స్తబ్దత ఏర్పడటం, ఇసుక కొరతతో మిగతాచోట్ల కూడా నిర్మాణాలు నిలిచిపోవటం కార్మికులకు శాపంగా మారింది.
మన రాష్ట్రంలో ఇసుక విస్తృతంగా లభించే కృష్ణాతీరంలోనే ఇలాంటి విపత్కర పరిస్థితి రావటం ఆందోళన కల్గించే అంశం. నదిలో వరద కారణంగా ఇసుక తవ్వకాలు జరపటం లేదని ప్రభుత్వం చెబుతున్నా.... సమస్య తీవ్రత దృష్ట్యా కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించటం, వేరే విధంగా ఆదుకోవటం అత్యవసరంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి :ఇసుక కొరతతో మరో కార్మికుడి బలవన్మరణం