కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయా వర్గాలకు చెందిన 78 శాతం మందిని మేయర్, ఛైర్మన్ స్థానాల్లో నియమించామన్నారు. మొత్తం 86 పదవుల్లో చట్ట ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 45 స్థానాలు ఇవ్వాల్సి ఉండగా.. 67 మందికి పదవులు ఇచ్చామని చెప్పారు.
బీసీ, మైనార్టీలకు చట్ట ప్రకారం 30 స్థానాలు ఇవ్వాల్సి ఉండగా.. సీఎం జగన్ 52 స్థానాలు ఇచ్చారని సజ్జల వెల్లడించారు. 40 మంది బీసీలు అంటే.. 46.51శాతం, మైనార్టీలు 12 మంది అనగా.. 13.95 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు ఉన్న రిజర్వేషన్లకు మించి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. 86 పదవుల్లో.. చట్ట ప్రకారం మహిళలకు 42 పదవులు రావాల్సి ఉందని... కానీ మహిళలకు సీఎం జగన్ 60.4శాతం అంటే 52మందికి కేటాయించినట్లు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి లోతుగా చర్చించి.. అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను నిర్ణయించారన్నారు.
ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని వివరించారు. వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకోవడం విడ్డూరంగా ఉందనని వ్యాఖ్యానించారు. సెలవులు వాయిదా వేసుకుని.. ఎన్నికలు జరిపించాలని ఎస్ఈసీని సజ్జల రామకృష్ణ కోరారు.
ఇదీ చదవండి:
సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్