గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరి ఉద్యోగం కూడా పోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరీక్ష పాస్ కావాలన్నారు. ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారని తెలిపారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని సజ్జల పేర్కొన్నారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని సజ్జల పేర్కొన్నారు.
ప్రస్తుతం పాడైన రోడ్లన్నీ తెదేపా హయాంలో దెబ్బతిన్నవే అని సజ్జల అన్నారు. రోడ్లపై గుంతలు పడ్డాయని తెదేపా అన్నిచోట్లా ఆందోళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణానికి రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం టెండర్లు పిలిచిందని.. వర్షాలు తగ్గాక రహదారి పనులు ప్రారంభం అవుతాయని సజ్జల అన్నారు.
రాయలసీమ లిఫ్టుపై తెదేపా వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పాలి. ఆయన హయాంలోనే పాలమూరు రంగారెడ్డి తెలంగాణ కట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు గతంలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ దీక్ష చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. రాయలసీమకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో జనంలోకి వెళ్లి తెదేపా నేతలు చెప్పాలి. లిఫ్టు వల్ల రాయలసీమకు ఎక్కడా అన్యాయం జరగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకెళ్లాలని కాలువలు వెడల్పు చేయాలని సీఎం నిర్ణయించారు'- సజ్జల రామకృష్ణారెడ్డి
2014లో రూ.90 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు పాలన ప్రారంభమైందని.. చంద్రబాబు దిగేముందు మాకు రూ. 2.6 లక్షల కోట్ల అప్పులు అప్పగించారని సజ్జల అన్నారు. చంద్రబాబు తమకు రూ.60 వేల కోట్లు పెండింగ్ బిల్లులు అప్పగించారని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసమే అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. అప్పు చేయకుంటే డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం, ప్రింట్ చేస్తామా అని సజ్జల ప్రశ్నించారు. కరోనా వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని.. రాష్ట్రానికి 20 నుంచి 30 వేల కోట్లు అదనపు ఖర్చు పెరిగిందని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
'కొవిడ్‌తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గింది. 20-30 వేల కోట్లు అదనంగా పెట్టాల్సి వస్తోంది. కరోనా వల్ల రాష్ట్రంలో సంక్షోభం భయంకరంగా ఉంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా? అని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షోభం సమర్థంగా ఎదుర్కొనేందుకు రోజుకు 16 గంటల పాటు కష్టపడి పని చేస్తున్నారు. ధరల పెరుగుదలపై మమ్మల్ని నిలదీసే నైతిక హక్కు తెదేపాకు లేదు. చంద్రబాబు హయాంలో జరిగిన మాఫియా పాలనను ప్రజలు మరచిపోలేదు. మతపరంగా రెచ్చగొట్టేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. పోలవరం సహా రావాల్సిన నిధులను రప్పించేందుకు జీవీఎల్ సహా నేతలు చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పిస్తే భాజపా నేతలకు మంచి జరుగుతుంది’-- సజ్జల రామకృష్ణారెడ్డి
ఇదీ చదవండి: