తెలంగాణలోని ఆదిలాబాద్‌లో సీటీ స్కానింగ్‌ల నిర్వహణ అడ్డూ అదుపులేకుండా కొనసాగుతోంది. అనారోగ్యంతో వచ్చినవారిని నాడీ పట్టకుండానే సీటీస్కానింగ్‌లు చేయించడమే వ్యూహాత్మకమైన దందాగా సాగుతోంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో సరైన రిపోర్టు రాదనీ, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు అందుబాటులో లేవని కొంతమంది వైద్యులే బాధితులకు సూచిస్తుండటంతో సీటీ స్కానింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో సీటీ స్కానింగ్‌కు రూ.5550 చొప్పున బిల్లువేస్తూ రోజుకు కనీసం వందమందికి తగ్గకుండా చేస్తుండటం వల్ల నిర్వాహకులకు సగటున రూ.5లక్షలకుపైగా ఆదాయం సమకూరుతోంది.
దాని ప్రభావమే..
మహారాష్ట్రలో విజృంభిస్తున్న వ్యాధి ప్రభావం సరిహద్దున ఉన్న ఆదిలాబాద్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే ప్రైవేటులో సీటీ స్కాన్ చేసుకోవాలనే ప్రజల భావన సైతం వైద్యులకు కలిసి వస్తోంది. ఆదిలాబాద్‌లోని కొంత మంది ప్రైవేటు వైద్యుల కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతోంది. ఆసుపత్రికి రావడమే ఆలస్యమన్నట్లుగా సీటీస్కానింగ్ కోసం రిఫర్‌చేసే విధానం అమలవుతోంది. ఫలితంగా రిఫర్ చేసిన వారికి కొంత, నిర్వాహకులకు మరికొంత అన్న చందంగా ప్రైవేటు వైద్యం మారిపోయింది.
చర్యలు తప్పవు..
ఆదిలాబాద్ ఏజెన్సీతోపాటు మహారాష్ట్రలోని కిన్వట్, పాటన్, బోరి, ముకుడుబన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా చిన్న, చిన్న వ్యాధులతో వస్తున్నవారికి సీటీ స్కానింగ్ చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. అవసరం లేకపోయినా సీటీ స్కానింగ్ చేసినట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులైన ప్రైవేటు వైద్యులపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
- ఇదీ చదవండి: స్టాలిన్ శకారంభం.. డీఎంకే 155 స్థానాలు కైవసం