Road problems in andhra pradesh: ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన కొత్త రహదారుల పనులు ముందుకు సాగడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ రహదారుల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇంకొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. రూ.150 కోట్లకుపైగా బిల్లులు గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో ఏఐఐబీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.4వేల కోట్లతో 5,200 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల పనులను 2019లో ప్రారంభించాయి. వీటిలో ఇప్పటివరకు 1,400 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకో 3,800 కిలోమీటర్ల మేర పూర్తి చేయాలి. కొన్నాళ్లపాటు గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించడంతో కొన్ని చోట్ల పూర్తయ్యాయి. ఆ తరువాత చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులను నిలిపివేస్తున్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కొన్ని రహదారుల పనులు నిలిపివేసి 6 నుంచి 8 నెలలు అవుతోంది.
ఏఐఐబీ వాటాలో రూ.506.96 కోట్లు విడుదల
రహదారుల ప్రాజెక్టుకు సంబంధించి ఏఐఐబీ తన వాటాలో నుంచి ఇప్పటివరకు రూ.506.96 కోట్లను విడుదల చేసినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలిసింది. మొత్తం రూ.4,290 కోట్ల ప్రాజెక్టులో ఏఐఐబీ 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు సమకూర్చాలి. ఇప్పటివరకు పూర్తయిన పనులకు దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. మరో 12 ప్యాకేజీల్లో చేపట్టాల్సిన 120 కిలోమీటర్ల పనులకు ఇంకా టెండర్లే ఖరారు కాలేదు.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ఏర్పాట్లు: ఈఎన్‌సీ
ఏఐఐబీ ప్రాజెక్టులో చేపట్టే రోడ్ల పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సుబ్బారెడ్డి తెలిపారు. సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా ఈఎన్‌సీ పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలో ఇక నుంచి నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో పుల్లలచెరువు-గంగవరం మధ్య తారు రోడ్డు నిర్మాణం కోసం 2019 జనవరి 1న శంకుస్థాపన చేశారు. రూ.1.85 కోట్ల అంచనాలతో ప్రారంభించిన రోడ్డు పని రెండేళ్లలో పూర్తవ్వాలి. 25% పని పూర్తయ్యాక గుత్తేదారు పనులు ఆపేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల రోడ్డు అలాగే మిగిలిపోయింది.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో మురపాక బీటీ రోడ్డు నుంచి బయ్యన్నపేట మీదుగా యాతపేట వరకు రూ.80 లక్షలతో రోడ్డు పనులకు 2019 జనవరి 21న శంకుస్థాపన చేశారు. 1.99 కిలోమీటర్ల ఈ రోడ్డు పని ఒప్పందం ప్రకారం 2021 జనవరి ఒకటికి పూర్తవ్వాలి. ఇప్పటివరకు చేసిన పనికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు అసంపూర్తిగా నిలిపివేశారు.