తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... కర్ణాటక లోని కాంగ్రెస్ అగ్ర నేతలను కలిశారు. బెంగళూరులో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌లతో మర్యాదపూర్వకంగా రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డికి ఆయా నేతలు శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా... తెలంగాణలోని పరిస్థితులను వారికి రేవంత్ వివరించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా నేతలను ఆహ్వానించారు. అంతకుముందు బెంగళూరులో కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.
సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గేలు కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. డీకే శివకుమార్ నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ నెల 7న నేను పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నా. పదవి చేపట్టే ముందు శివకుమార్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నా. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యాచరణపై చర్చించాం. నేను పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కర్ణాటక నేతలను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వచ్చాను. -రేవంత్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు
1:30 గంటలకు బాధ్యతలు..
ఈ నెల ఏడో తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షిడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందు కోసం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకమాండ్ తన పేరును ప్రకటించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నేతలను వరుసగా కలుస్తూ ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం నిరుద్యోగ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తానని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. రైతులకు సంబంధించి తమ వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని చెప్పారు. పార్టీ ఆమోదం తర్వాత ఆ ప్రణాళికను వెల్లడిస్తానని రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: