సస్పెండ్ అయిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణకు తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఓ ఛానెల్‌కు సంభాషణను లీక్ చేశారని అందులో పేర్కొన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండానే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం అవాంఛనీయం, చట్టవిరుద్ధమని తెలిపారు.
కరోనా నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్యకు చెందిన లక్ష్మీనరసయ్య గతంలో ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్లు వేశారు. ఆ సమయంలో తనకు, జస్టిస్ ఈశ్వరయ్యకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఆ పిటిషన్లకు జత చేశారు. ఆడియో టేపులు పరిశీలించిన హైకోర్టు.. విశ్రాంత న్యాయమూర్తికి, జడ్జికి మధ్య ఫోన్ సంభాషణలు వింటే కోర్టుపై కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. వాస్తవాలు తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌కు అప్పగిస్తూ ఆగస్టు 13న ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్టే ఇవ్వాలంటూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవు