రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఒకటో తేదీన అందడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల ఆరో తేదీ సాయంత్రం వరకు వేల మంది విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందలేదు. కొందరు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలూ రాలేదు. నిధులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని సమాచారం.
జీతాల కోసం రూ.4,000 కోట్లు, పింఛన్ల కోసం రూ.1,500 కోట్ల వరకు ప్రతినెలా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు తగినట్టుగా నిధులు లేక చాలాసార్లు జీతాలు, పింఛన్లు ఆలస్యమయ్యాయి. దీంతో వేల మంది విశ్రాంత ఉద్యోగులు పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు అందలేదని ఫిర్యాదులు వచ్చిన చోట మాత్రం హడావుడిగా ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు.
రాష్ట్రంలో పింఛన్లు, జీతాలు రాని వారు ఇంకా చాలామంది ఉన్నారు. తమకు వచ్చే పింఛనే తక్కువని, పైగా వృద్ధాప్యంలో చాలా ఖర్చులు ఉంటాయని వారు చెబుతున్నారు. నెలకు రూ.10వేల వరకు మందుల ఖర్చులే అవుతాయని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడొకరు చెప్పారు. ఒకటో తేదీన ఖాతాలో పింఛను జమ కాకపోతే మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారని ఆయన వెల్లడించారు. ఆర్థికశాఖ అధికారులను సంప్రదించాలని ప్రయత్నిస్తే వారు ఫోన్లకు స్పందించరని చెబుతున్నారు. జీతాలు ఆలస్యమైనా పింఛన్లు ఒకటో తేదీన ఇస్తే వృద్ధులకు సమస్యలు తప్పుతాయని అంటున్నారు. ప్రభుత్వం మంగళవారం రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. ఆ నిధులు ఖజానాకు జమ అయ్యాక కొంతమేర జీతాలు, పింఛన్లు చెల్లిస్తారని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గురువారానికి ఈ సమస్య కొంతవరకు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి.
ఇదీ చదవండి : Ysr asara: నేడు 'వైఎస్సార్ ఆసరా' పథకం రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల