ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం, కరవు భత్యం, సీసీఏలతో పాటు.. ఇతర అలవెన్సులనూ పెంచాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర నేతృత్వంలోని పదకొండో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది. వాటిలో ముఖ్యమైనవి...
డెయిలీ అలవెన్సులు పెంచాలి..
- ప్రజారవాణా సదుపాయంలేని ప్రాంతాలకు అధికారిక విధులపై వెళ్లే అధికారులకు మైలేజి అలవెన్సును... గ్రేడ్-1 అధికారులకు కి.మీ.కి రూ.7 నుంచి రూ.9కి, గ్రేడ్-2 అధికారులకు రూ.6 నుంచి రూ.7.80కి, గ్రేడ్-3 అధికారులకు రూ.5 నుంచి రూ.6.50కి పెంచాలి.
- సొంత వాహనాలపై వెళ్లేవారికి మైలేజి ఛార్జీని పెట్రోలు కార్లకు కి.మీ.కి. రూ.13 నుంచి రూ.15.50కి, డీజిలు కార్లకు రూ.9 నుంచి రూ.11కి, ద్విచక్రవాహనాలకు రూ.5 నుంచి రూ.6.40కి పెంచాలి.
- డెయిలీ అలవెన్సును మన రాష్ట్రంలో గ్రేడ్-1 ఉద్యోగులకు రూ.600కి, గ్రేడ్-2కి రూ.400కి, గ్రేడ్-3కి రూ.300కి పెంచాలి. రాష్ట్రం బయటకు వెళ్తే గ్రేడ్-1కి రూ.800కి, గ్రేడ్-2కి రూ.600కి, గ్రేడ్-3కి రూ.400కి పెంచాలి.
- అధికారిక విధులపై రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఉద్యోగులకు రోజువారీ లాడ్జింగ్ ఛార్జీలను పెంచాలి. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్‌లలో గ్రేడ్-1కి రూ.1,700కి, గ్రేడ్-2కి రూ.1020కి, గ్రేడ్-3కి రూ.685కి పెంచాలి. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేషన్లలో గ్రేడ్-1కి రూ.975కి, గ్రేడ్-2కి రూ.585కి, గ్రేడ్-3కి రూ.400కి పెంచాలి.
- ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ట్యాక్సీ/ఆటో ఛార్జీలను రోజుకు ఇప్పుడున్న రూ.600 నుంచి రూ.750కి పెంచాలి.
- ఉద్యోగులు బదిలీ అయినప్పుడు ఇంటి సామగ్రి రవాణాలకు గ్రేడ్-1 ఉద్యోగులకు కి.మీ.కి గరిష్ఠంగా రూ.30, గ్రేడ్-2కి రూ.24, గ్రేడ్-3కి రూ.18 చొప్పున చెల్లించాలి. ప్యాకింగ్ ఛార్జీలనూ పెంచాలని సిఫార్సు.
- రాష్ట్రం నుంచి దిల్లీ లేదా ఇతర రాష్ట్రాలకు, ఆయా ప్రాంతాల నుంచి ఏపీకి ఉద్యోగుల్ని బదిలీ చేసినప్పుడు ఇచ్చే ‘డిస్టర్బెన్స్ అలవెన్సు’ను గ్రేడ్-1 ఉద్యోగులకు రూ.18,750కి, గ్రేడ్-2కి రూ.14,000కి, గ్రేడ్-3కి రూ.7,500కి పెంచాలి.
- ఎక్కువ రోజులు టూర్లలో ఉండే అధికారులకు ఇచ్చే ‘ఫిక్స్‌డ్ ట్రావెల్ అలవెన్సు (ఎఫ్‌టీఏ)’ పెంచాలి. గ్రేడ్-8, దానికి దిగువ కేటగిరీ ఉద్యోగుల్లో నెలకు 15 రోజులపాటు టూర్లలో ఉండేవారికి.. వారు పనిచేస్తున్న మండలంలోనే అయితే రూ.780, మూడు మండలాల్లో తిరిగేవారికి రూ.900, రెవెన్యూ డివిజన్‌లో రూ.1,050 చొప్పున చెల్లించాలి. నెలకు 20 రోజులు టూర్ చేయాల్సిన అధికారులకు మండలంలో రూ.1040, మూడు మండలాలకు రూ.1,200, రెవెన్యూ డివిజన్ మొత్తం తిరిగేవారికి రూ.1,400 చొప్పున ఇవ్వాలి.
- గ్రేడ్-9, అంతకంటే పై కేటగిరీలో ఉండే అధికారుల్లో 15 రోజులపాటు టూర్‌లో ఉండేవారికి... వారు పర్యటించే పరిధిని బట్టి రూ.975, రూ.1,170, రూ.1,275 చొప్పున చెల్లించాలి. 20 రోజులపాటు టూర్‌లో ఉండేవారికి వారి పరిధిని బట్టి రూ.1,300, రూ.1,560, రూ.1,700 చొప్పున చెల్లించాలి.
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో రాయితీ
- విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న నాలుగో తరగతి, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, నాన్-గెజిటెడ్, గెజిటెడ్ (ప్రభుత్వం వాహనం సమకూర్చనివారికి) ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలి. ఈ సదుపాయాన్ని రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లలో ఆర్టీసీ సిటీ బస్సులు నడిపే చోట్లా వర్తింపజేయాలి. సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం రూ.45,830-1,30,580 స్కేలు వరకు ఉన్న అధికారులకే దాన్ని వర్తింపజేయాలి.
- పోలీసు, ఎక్సైజ్, ఫైర్ వంటి యూనిఫాం సర్వీసుల ఉద్యోగులకు యూనిఫాం అలవెన్సును సంవత్సరానికి రూ.3 వేల నుంచి రూ.4,500కి, గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ యూనిట్లలో పనిచేస్తున్నవారికి రూ.7,500 నుంచి రూ.11,000కి, సీఐడీ, జిల్లా స్పెషల్ బ్రాంచీల్లో పనిచేస్తున్నవారికి రూ.450 నుంచి రూ.675కి పెంచాలి.
- నర్సులకు రూ.2,250 నుంచి రూ.3,500కి, హైకోర్టు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌లో పనిచేసే ఉద్యోగుల్లో నల్లకోటు ధరించాల్సిన వారికి రూ.1,500 నుంచి రూ.2,250కి, ల్యాబ్స్‌లో యాప్రాన్ ధరించేవారికి రూ.750 నుంచి రూ.1,125కి పెంచాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లనూ ఈ జాబితాలో చేర్చి రూ.2,500 అలవెన్సు ఇవ్వాలి. ఈ అన్ని కేటగిరీల ఉద్యోగులకు యూనిఫాం మెయింటెనెన్స్ అలవెన్సునూ పెంచాలి. యూనిఫాం కుట్టు ఛార్జీలను రూ.350కి పెంచాలి.
- కొన్ని ప్రత్యేక కేటగిరీల ఉద్యోగులకు ఇచ్చే రేషన్ అలవెన్సును పెంచాలి. కొన్ని కేటగిరీల ఉద్యోగులకు ఇచ్చే నైట్‌షిఫ్ట్ అలవెన్సును రోజుకి రూ.50కి పెంచాలి.
వైద్యులకు ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ అలవెన్సు పెంపు - వైద్యులకు ఇచ్చే ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ అలవెన్సును... వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే బోధనేతర వైద్యులకు రూ.4,500కి, ఐఎంఎస్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వచ్చేవారికి రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు, ఆయుష్ వైద్యులకు రూ.1000 నుంచి రూ.2 వేలకు, పశువైద్యులకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పెంచాలి.
- ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం ఉన్న విభాగాల్లో పనిచేసే వైద్యులకు ఇచ్చే నాన్ ప్రైవేటు ప్రాక్టీసు అలవెన్సుని సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేటగిరీలో ఉన్నవారికి నెలకు రూ.800 నుంచి రూ.1,200కి, డిప్యూటీ సివిల్ సర్జన్ కేటగిరీలో ఉన్నవారికి రూ.వెయ్యి నుంచి రూ.1,500కి, సివిల్ సర్జన్లు, ఆపై కేటగిరీలో ఉన్నవారికి నెలకు రూ.1,200 నుంచి రూ.1,800కి పెంచాలి.
టెండర్ల ద్వారా ట్రావెల్ ఏజెన్సీల్ని ఎంపిక చేయాలి
‘పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలు అధికారులు, ఉద్యోగుల అధికారిక ప్రయాణాలకు విమానం, రైలు టికెట్లను ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ చేస్తున్నారు. వారు విపరీతంగా సర్వీసు ఛార్జీలు వేస్తున్నారు. దాన్ని నివారించేందుకు పేరెన్నికగన్న ట్రావెల్ ఏజెన్సీల నుంచి టెండర్లు పిలవాలి. కోట్ చేసిన ధరలపై వారితో చర్చించి నిర్దిష్టమైన సర్వీసు ఛార్జీలను నిర్ణయించాలి. అలాంటి ఏజెన్సీలతో ఒక ప్యానల్ సిద్ధం చేసి ప్రభుత్వ విభాగాలకూ పంపాలి’ అని కమిషన్ సిఫార్సు చేసింది.
ఇదీ చదవండి: ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా చేయాల్సిందే..: అశుతోష్ మిశ్ర కమిటీ