కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేయగా.. ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా స్పందించారు. వైకాపా నేతలు కూడా.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కరోనా నేపథ్యంలో.. ఈ వివాదం సమసిపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ అనూహ్యంగా ఆర్డినెన్స్ తెచ్చింది. రాజ్యాంగంలోని 243-K ప్రకారం.. ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాల మేరకు ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ.. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులిచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ సైతం ఆమోదించినట్టు సమాచారం. వీటిని రహస్యంగా ఉంచిన కారణంగా.. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
కుదింపుతో ముగింపు..
నవ్యాంధ్ర తొలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా 2016 ఏప్రిల్1న బాధ్యతలు స్వీకరించిన రమేశ్ కుమార్..2021 మార్చి 3వరకూ కొనసాగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించడంతో నిమ్మగడ్డ రమేశ్ పదవీకాలం 2019 మార్చి 31కే ముగిసినట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఎస్ఈసీపై విమర్శల వర్షం
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నిర్ణయం రుచించని అధికార పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంపై హుటాహుటిన గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు మీడియా సమావేశంలో బాహాటంగానే నిమ్మగడ్డ రమేశ్‌ను నిందించారు. ప్రతిపక్ష తెదేపా ఆదేశాల మేరకే వాయిదా వేశారని ఆరోపించారు. అంతే... సీఎం బాటలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు రమేశ్ పై దూషణలకు దిగారు. ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రానికి లేఖతో మరింత ఆగ్రహం!
ఈ క్రమంలోనే తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఈ విషయం అధికారపక్షానికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు నిమ్మగడ్డ కుట్ర చేస్తున్నారని వైకాపా విరుచుకుపడింది. రమేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోపోతే ఎలా తప్పించాలో తమకు తెలుసంటూ...ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలోనే హెచ్చరించారు. ఎన్నికల వాయిదాను వ్యతిరేకిస్తూ వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. అయితే ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం..... ఎన్నికల కోడ్ ఎత్తివేతకు ఆదేశించింది.
తదనంతరం రాష్ట్రంలో కరోనా ప్రభావం క్రమంగా పెరగడంతో ప్రజల దృష్టంతా దానిమీదే కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి చల్లారినట్లే అని అందరూ భావిస్తున్న తరుణంలో... కరోనా సాయం కింద ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల్ని కొన్నిచోట్ల వైకాపా నేతలు పంచడం విమర్శలకు తావిచ్చింది. ఇది కోడ్ ఉల్లఘనేనంటూ తెలుగదేశం సహా వివిధ పక్షాలు నిమ్మగడ్డ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రమేశ్......నివేదికలు పంపాలని జిల్లా స్థాయి ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాల మధ్యే.. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి... ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: