గులాబ్ తుపాను తీరం దాటిన తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. రాగల 6 గంటల్లో అది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని కోరారు.
- కృష్ణాజిల్లాలో..
గులాబ్ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. రహదారులన్నీ జలమయ్యాయి. విజయవాడ నగరంలోనూ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రహదారిపై మోకాళ్లలోతు నీరు చేరడంతో నగరవాసులు అడుగుబయట పెట్టలేకపోతున్నారు. సింగ్ నగర్, వాంబేకాలనీ, మొగల్రాజపురం, నిర్మల కాన్వెంట్, బెంజ్ సర్కిల్ , బందర్ రోడ్డు రహదారులన్నీ పూర్తిగా నీట మునిగాయి.
భారీ వర్షాలకు విజయవాడ పరిధిలోని గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. వర్షంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేక గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన విమానం.. సుమారు అరగంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది.
విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు సహా కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు ఉప్పొంగటంతో మోకాలు లోతు మేర వర్షపునీరు నిలిచి స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
- విజయనగరం జిల్లాలో..
తుపాను ప్రభావంతో విజయనగరంజిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో... జిల్లాలో 10సెంటీమీటర్ల వర్షపాతం సగటు వర్షపాతం నమోదైంది. గజపతినగరంలో 20సెంటీమీటర్లు, నెల్లిమర్లలో 19, పూసపాటిరేగలో 15, గరివిడి 14, భోగాపురంలో13, విజయనగరం, డెంకాడలో..12సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి ప్రభావంతో..వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గంట్యాడ మండలం కొండపర్తి - వసంత గ్రామాలకు వెళ్లే రహదారిలో వరద నీరు పోటెత్తడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. సాలూరు మండలంలో గోముఖ, సువర్ణముఖి, వేగావతి నదుల ఉదృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమీప కాలనీల్లోకి వరదనీరు చేరింది. కొత్తవలస-సబ్బవరం మార్గంలో గవరపాలెం వద్ద గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డకి అనుకుని ఉన్న నివాసాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. కొత్తవలస రైల్వేస్టేషన్ ఉత్తర యార్డు వైపు రైలు పట్టాలపైకి నీరు చేరింది. గరివిడిలోని బంగారమ్మ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరటంతో.., ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంబాలు, చెట్టు నెలకొరిగాయి. విద్యుత్తు స్తంబాలు పడిపోవటంతో., విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాం ఏర్పడింది. అదేవిధంగా చెట్టు నెలకొరగటంతో., ప్రధాన రహదారుల్లో వాహన రాకపోకలు స్తంభించాయి. వరదనీటి ఉద్ధృతి కారణంగా జిల్లాలో 13,122 హెక్టార్లలో ఆహార పంటలు, 291 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిళ్లినట్లు అధికారుల ప్రాధమిక అంచనా వేశారు. 9 పశువులు మృతి చెందాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు.
- శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నారు. ఆమదాలవలస మండలం హనుమంతపురం గ్రామం వద్ద రహదారిపైకి భారీగా వరదనీరు చేరింది. దీంతో గ్రామస్థుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పరిసర గ్రామాల్లో పంట పొలాలు కొంతమేర ముంపునకు గురయ్యాయి.
- విశాఖ జిల్లా..
విశాఖ జిల్లా సింహాచలం మెట్ల మార్గంలో వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. కొండపైన కురిసిన వర్షానికి నీరు మెట్ల మీదుగా కిందికి వెళ్తోంది. ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పెందుర్తి మండలం వేపగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఓ మహిళ మృతిచెందింది. పెందుర్తి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద గోడకూలిపోయింది. ఈదురుగాలులకు అక్కిరెడ్డిపాలెం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రెండు తాటి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలకు దుర్గానగర్, నాయుడుతోట ప్రాంతాలు నీటమునిగాయి.
గాజువాకలోని సుందరయ్య కాలనీ వద్ద విషాదం చోటు చేసుకుంది. వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు.
- తూర్పుగోదావరి జిల్లా..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రామకృష్ణారావుపేటలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. సాంబమూర్తినగర్, పల్లంరాజుపేట,రేచర్లపేట, దుమ్ములపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరింది. మరోవైపు కోనసీమలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. అమలాపురంలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. రాజమహేంద్రవరం, రంపచోడవరం, పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.
- పశ్చిమగోదావరి జిల్లా..
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. 20 మండలాల్లో వంద మిల్లీ మీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలోని కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం మండలాల పరిధి ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు నీటిమయం అవ్వటంతో ఏజెన్సీ గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. వరి, వేరుశనగ పంటలు వరదతో నీటమునిగాయి. ఆగకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మన్యం గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కామర్ కోట మండలం ఆడమిల్లి గ్రామం వద్ద రహదారి ధ్వంసం కావడంతో ఏలూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బయటకు రావడానికి వీలేక ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
- గుంటూరు జిల్లా..
గులాబ్ తుపాన్ ప్రభావంతో తెనాలి వేమూరు నియోజకవర్గాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. తెనాలి పట్టణంలో గాంధీ చౌక్, బోసుబొమ్మ రోడ్డు, గంగానమ్మ పేటలో రోడ్లు జలమయమయ్యాయి.
ఇదీ చదవండి: HEAVY RAINS: గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు