తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఒకటీ రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణా, ఒడిశా, చత్తీస్ఘడ్లలోనూ చాలాచోట్ల విస్తారంగా వానలు పడే అవకాశముంది. వాయుగుండంగా మారిన అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ 12 తేదీ ఉదయానికి ఉత్తర కోస్తా తీరంలోని విశాఖ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. కృష్ణా జిల్లా నూజివీడులో 3 సెంటిమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో 2.6 సెంటిమీటర్లు, చిత్తూరులో 1, కర్నూలు ఓర్వకల్లులో 1 సెంటిమీటరు మేర వర్షపాతం నమోదైంది.
విశాఖ జిల్లాకు వాతావరణ విభాగం హెచ్చరికలు
విశాఖ జిల్లాకు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా అధికారులను కలెక్టర్ వినయ్‌చంద్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు 0891–2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు. లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చదవండి: సామాన్యుడికి షాక్..ఇంటికి రూ.1.4 లక్షల విద్యుత్ బిల్లు