రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం తెరాసతో మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలోనే చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. తెరాసలో సామాన్య కర్యకర్తగా ప్రారంభమైన మాధవనేని రఘునందన్ రావు జీవితం.. భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది.
బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా..
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.
రెండుసార్లు ఓటమే..
తెరాస ప్రారంభం నుంచి రఘునందన్ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమించారు. 2013లో గులాబీ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన రఘును.. భాజపా అక్కున చేర్చుకుంది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో గులాబీ కోటలో కాషాయం ఎగరవేశారు.
ఇవీ చూడండి : దుబ్బాక ఉప ఎన్నిక పోరు.. జయకేతనం ఎగురవేసిన భాజపా