Psychiatric patients: దీర్ఘకాలిక వ్యాధుల కంటే.. మానసిక రుగ్మతలు ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని.. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ భరత్ వట్వాని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడం.. మంచి, చెడుల గురించి చెప్పేవారు ఇళ్లలో లేకపోవడం, ఉన్నవారూ తగిన సమయం కేటాయించలేకపోవడం వంటి కారణాలతో మానసిక రుగ్మతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయన్నారు. మహారాష్ట్రకు చెందిన ఈయన రోడ్లపై తిరిగే మానసిక రోగులకు ‘శ్రద్ధ రీహాబిలిటేషన్ ఫౌండేషన్’ ద్వారా పునర్జన్మ ఇస్తున్నారు. విజయవాడ వచ్చిన సందర్భంగా భరత్ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మానసిక రుగ్మతలుపెరిగే అవకాశం
ప్రపంచ ఆరోగ్యసంస్థ అధ్యయనం ప్రకారం 2030 నాటికి మొత్తం జనాభాలో 33% మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. మానసిక రుగ్మతల చికిత్స నగరాలు, పట్టణాల్లోనే అందుబాటులో ఉండటంతో పల్లెల్లో మానసిక సమస్యలు ప్రాథమిక స్థాయిలో ఉన్నవారికి తగిన సలహాలు, సూచనలు అందడంలేదు. 2019లో రోజూ 381 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెంగుళూరులోని నిమ్‌హాన్స్ లెక్కల ప్రకారం దేశంలోని 13.7% మందికి మానసిక రుగ్మతలున్నాయి. 1.9% మంది తీవ్ర మానసిక సమస్యలతో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలాంటి గూడూ లేని భారతీయులు 18 లక్షలు కాగా, వీరిలో సుమారు 50%కు మానసిక సమస్యలున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వివక్ష తక్కువ
మానసిక రుగ్మతలతో బాధపడే వారికి గ్రామాల్లో సాంత్వన చేకూరుతోంది. పట్టణాల్లో ఇది కనిపించడంలేదు. చిన్న కుటుంబాల్లో వీరిపై దృష్టిపెట్టే అవకాశం లేక.. ఒంటరిగా ఉండేవారిలో మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. కొవిడ్ సమయంలో కుంగుబాటు సమస్యలు పెరిగాయి. ఆత్మహత్య ఆలోచనలను కుటుంబసభ్యులు ముందుగానే పసిగట్టి... జాగ్రత్తలు తీసుకుంటే విలువైన ప్రాణాలు దక్కుతాయి. నిరుద్యోగ ప్రభావం కూడా మానసిక సమస్యలకు కారణమవుతోంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి పది లక్షల జనాభాకు 60-200 మంది మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. కనీసం 30 మంది అవసరం కాగా, మనదేశంలో ఆరుగురే ఉన్నారు.
ఏపీతో త్వరలో ఒప్పందం
ముంబయి నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ‘ఖర్జత్’లోని ఆరున్నర ఎకరాల్లో మానసిక రుగ్మతలున్నవారికి చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చాక కుటుంబసభ్యుల వద్దకు పంపుతున్నాం. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోనూ మా ఫౌండేషన్ తరఫున సేవలు కొనసాగుతున్నాయి. త్వరలో మానసిక రోగులకు చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖతో ఒప్పందం చేసుకుంటాం. ఇప్పటికే ఏపీకి చెందిన ‘మనోబంధు’ సంస్థ ద్వారా విశాఖలో ఇతర రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది మానసిక రోగులకు మా ఆశ్రమంలో గత జనవరి నుంచి చికిత్స అందిస్తున్నాం. చికిత్స అందించిన అనంతరం వారిచ్చే సమాచారాన్ని బట్టి స్వస్థలాలకు పంపుతున్నాం. సంస్థ నిర్వహణ వ్యయాన్ని దాతలే భరిస్తున్నారు.
ఇదీ చదవండి:
వైకాపా పాలనలో రైతులకు మొండిచేయి.. ఇప్పటికీ అందని 2018 ఖరీఫ్ పెట్టుబడి రాయితీ