రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలు తారస్థాయికి చేరుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన మూర్ఖమైనిదని విమర్శించారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అఖిలపక్షం నాయకులు కదం తొక్కారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నెల్లూరులో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు మహిళలు పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరును జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విమర్శించారు. జగన్ రాచరిక పాలన చేయాలనుకుంటే జనం ఉపేక్షించరని మాజీ మంత్రి కేఎస్ జవహర్ కృష్ణాజిల్లా తిరువూరులో హెచ్చరించారు. మూడు రాజధానులు వద్దంటూ ప్రకాశం జిల్లా త్రిపురంతకం మండలం మేడిపి గ్రామం వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించారు. రాజధాని ఉద్యమంపై పోలీసుల వైఖరి అన్యాయమని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో విమర్శించారు.చిలకలూరిపేటలో నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి.అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా వామపక్ష నాయకులు ఎస్సై శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానం మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి